కరోనా మహమ్మారి విస్తరణతో విలవిల్లాడుతున్న పట్ణణ ప్రాంత పేదలకు చేయూతను అందించడం కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పేదలకు ఉచితంగా పాలు పంచిపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం ఉదయం బెంగళూరులోని అశ్వత్ నగర్‌లో తన చేతుల మీదుగా ఉచిత పాల పంపిణీ కార్యక్రామాన్ని ప్రారంభించారు.
కార్యక్రమం ప్రారంభం అనంతరం యడ్యూరప్ప బెంగళూరులోని అశ్వత్‌నగర్ ఏరియాలో గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటికి ఉచింతంగా పాల ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప వెంట కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, మంత్రి శివరామ్ హెబ్బర్, ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన యడ్యూరప్ప.. రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అందులో 42 లక్షల లీటర్ల పాలను ప్రభుత్వమే పాడి రైతుల నుంచి కొనుగోలు చేసి ఉచితంగా పట్టణ ప్రాంతాల పేదలకు పంపిణీ చేస్తుందని చెప్పారు.