పాల వెల్లువ

 ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయా డెయిరీని నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి పాలను సేకరించి చిల్లింగ్‌ చేయడంతోపాటు వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, లక్షెట్టిపేట, కడెం, భైంసా ప్రాంతాల్లో విజయా డెయిరీ ఆధ్వర్యంలో పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో కేంద్రం 5 వేల లీటర్ల సామర్థ్యంతో నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 25 వేల లీటర్ల సామర్థ్యం కేంద్రాలుండగా.. వచ్చే ఆరు నెలల్లో లక్ష లీటర్ల సామర్థ్యం గల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 20 వేల లీటర్లకు, లక్షెట్టిపేట్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 20 వేల లీటర్లకు, నిర్మల్‌లో ఉన్న 5 వేల లీటర్ల కేంద్రాన్ని 10 వేల లీటర్ల సామర్థ్యానికి పెంచుతున్నారు. మరోవైపు కుంటాల, లోకేశ్వరం, భైంసా మండలం దేగాం, జైనథ్‌, బేల, ఖానాపూర్‌, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి వంటి చోట్ల పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు టీఎస్‌డీడీసీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంపు కోసం నిధులు కావాలని కోరారు. దీంతో రూ. 18 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. ఇందులో కొన్నిచోట్ల పనులు పూర్తవ్వగా.. మరికొన్నిచోట్ల ప్రగతిలో ఉన్నాయి.